Ads 468x60px

Saturday, June 30, 2007

తెలుగు భాష

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదంలోన అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది...
మామ అన్న మాట మనసులోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది
పర భాషా జ్ఞానాన్ని సంపాదించు
కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా
కొంత రుణం తీర్చరా

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమి పైన ప్రాణులన్ని తమ భాషను మరువలేదు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగురాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషాచారాలను మింగేయొద్దు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా
వెనక్కి తగ్గమాకురా

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా
అమ్మా నాన్నా అంటూ నేటినుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా..


రచన: చంద్రబోస్
చిత్రం: నీకు నేను నాకు నువ్వు

1 comments:

  1. thank you for posting this wonderful song. If possible can you post audio/video of this song too.

    ReplyDelete

Share

Widgets