శ్రీలు పొంగిన జీవగడ్డయు
పాలు పాఱిన భాగ్యసీమయు
వ్రాసినది యీ భరతఖండము
భక్తి పాడర;తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యంబందె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!
విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిదె తమ్ముడా!
సూత్ర యుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్ర దాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెనే చెల్లెలా!
మేలి కిన్నెర మేలవించీ
రాలు కరగగ రాగ మెత్తీ
పాల తీయని బాల భారత
పదము పాడర తమ్ముడా!
నవరసమ్ములు నాట్యమాడగ
చివుర పలుకులు చెవుల విందుగ
కవిత లల్లిన కాంత హృదయం
గౌరవింపవె చెల్లెలా!
దేశ గర్వము దీప్తిచెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశ మరసిన దీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!
పాండవేయమల పదును కత్తులు
నుండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కవి. తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా!
లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవ పదముల
చేర్చిపాడర తమ్ముడా!
తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిది త్రుళ్ళీ
భంగపడని తెలుంగు నాధుల
పాట పాడవె చెల్లెలా!
రచన: రాయప్రోలు సుబ్బారావు
Wednesday, August 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment