Ads 468x60px

Saturday, January 20, 2007

దేశభక్తి-గురజాడ

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా.
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !


పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువ్వు పాటుపడవోయ్,
తిండి కలిగితే కండకలదోయ్
కండగలవాడేను మనిషోయ్ !


ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్ ?
బల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !

అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశి సరుకులు నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !


వెనుక చూచిన కార్యమేమోయ్
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుకపడితే వెనెకెనోయ్ !

పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధకలహం పెంచబోకోయ్
కత్తివైరం కాల్చవోయ్ !

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !


ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !



పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కదోయ్
ఒకరిమేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !

సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్ !

చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్ !

మతం వేరైతేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాత మన్నది లేచి పెరిగీ
లోకమున రాణీంచునోయ్ !

దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనంపంటలు పండవలెనోయ్ !

ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయ్,
పలుకులను విని, దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్.


రచన : స్వర్గీయ గురజాడ అప్పరావు

1 comments:

  1. గల్ఫ్ దేశాల్లో భారతీయుల అగచాట్లు,ఆస్ట్రేలియాలో భారతీయులకు అవమానం,అమెరికా గురుద్వారాలో కాల్పులు లాంటి బాధాకరమైన వార్తల నేపధ్యంలో ఒకసారి ఆలోచిద్దాం;
    “కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008)

    ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు.
    ‘మాతృభాషను మాతృభూమినీ దేశ పౌరుల్నీ ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘ విదేశాలలో మన దేశ ఘన కీర్తులు చాటుతున్న భారతీయ వీరులారా లేవండి.పల్లవి మార్చండి.మాతృదేశమే మాకు అమర దైవతము అనండి.భారతీయత లేని బ్రతుకును ఆశించకండి.భరత గడ్డమీదకు తరలి రండి.మనదేశ ప్రజలకే సేవ చెయ్యండి.

    ReplyDelete

Share

Widgets