యెంకితో తీర్తాని కెల్లాలి
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె
యెంకితో తీర్తాని కెల్లాలి!
నెత్తిమూటల నెత్తుకోవాలి!
కొత్త మడతలు దీసి కట్టాలి!
అడవి దారుల యెంట నడవాలి!
బరువు మారుసుకొంట పక్కున నవ్వాలి!
తాతనాటి పూవు తలవాలి!
దారిపొడుగున కీసు లాడాలి!
’తప్పు నీదే ’ యంట దెప్పాలి!
దైవ మున్నాడాని దడిపించుకోవాలి!
యెంకితో తీర్తాని కెల్లాలి
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె
యెంకితో తీర్తాని కెల్లాలి!
కతకాడ కూసింత నిలవాలి!
కతగాడు మావూసె సెప్పాలి!
నను చూసి పిల్లోడు నవ్వాలి!
మాలోన మామేటో మతు లిరుచుకోవాలి!
యెంకితో తీర్తాని కెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె!
యెంకితో తీర్తాని కెల్లాలి
కోనేటిలో తాన మాడాలి!
గుడిసుట్టు ముమ్మారు తిరగాలి!
కోపాలు తాపాలు మానాలి!
యిద్దరము పిల్లోణ్ణి యీశుడికి సూపాలి!
యెంకితో తీర్తాని కెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె!
యెంకితో తీర్తాని కెల్లాలి!
Friday, June 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment