యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
సెక్కిట సిన్నీ మచ్చ
సెపితే సాలదు లచ్చ!
వొక్క నవ్వే యేలు
వొజ్జిర మయిడూరాలు!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
పదమూ పాడిందంటె
పాపాలు పోవాల
కతలు సెప్పిందంటె
కలకాల ముండాల!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
తోటంత సీకట్లె
దొడ్డి సీకటిమయమె!
కూటి కెళితే గుండె
గుబగుబమంట బయిమె!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
రాసోరింటికైన
రంగు తెచ్చే పిల్ల!
నా సొమ్ము _ నా గుండె
నమిలి మింగిన పిల్ల!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్
Saturday, June 16, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment